నైవేద్యం.. దేవునికి ఆహారము సమర్పించడం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సాధారణంగా మనం ఇంట్లోపూజచేసేప్పుడు మనకు అందుబాటులో ఉండే ఏదో ఒక పుష్పఫలాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటాము. చేసేది నిత్యపూజ అయినా.. విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడంమే. అయితే వాస్తవానికి దేవుడికి నైవేద్యంగా దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూలు, పరమాన్నం లేదా పండ్లు లాంటివి పెడతారు.
కానీ, ఓచోట మాత్రం ఉల్లిపాయలను నైవేద్యంగా పెడతారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది అక్కడ ఆచారం. ఉల్లిపాయలు నైవేద్యంగా సమర్పించే ఆలయం కూడా ఉంది. రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జిల్లా, గోడిమెడ పట్టణంలో ఉన్న 950 ఏళ్ల నాటి గోగాజీ ఆలయంలో దైవానికి ఉల్లిపాయలను భక్తులు నైవేద్యంగా పెడతారు. ఇక్కడ ప్రధాన దైవం గోగాజీ మహారాజ్. ఈ ఆలయం హిందూ ముస్లిం నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. మెడలో సర్పం, చేతిలో కత్తితో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగా గోగాజీ విగ్రహం కనిపిస్తుంది.
ఈ ఆలయంలో కాళికాదేవి రాతి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఇక్కడ అత్యంత ఘనంగా గోగాజీ మేళాను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయ సందర్శనకు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ వంటి అనేక ప్రధాన పట్టణాల నుంచి భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతారు.ఈ సందర్భంగా భక్తులు పప్పు, ఉల్లిపాయలను కానుకగా సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన టన్నుల కొద్దీ ఉల్లిపాయలను నిర్వాహకులు సేకరించి ఆలయ పరిసరాల్లో ఉండే ఆవులకు దాణాగా వినియోగిస్తారట. ఇక మనకు ఉన్న వేల ఆచారాల్లో ఇది కూడా ఓ ఆచారం.
No comments:
Post a Comment