కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే మరో నలుగురు తెలంగాణలో కన్నుమూశారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ మొత్తం ఆరుగురులో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్లో ఒకరు, గద్వాలలో ఒకరు మరణించినట్లు ఆ బులెటిన్‌లో తెలిపారు.
అయితే తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం విశేషం. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశ రాజధాని దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ తర్వాత వీరు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న చాలా మందికి ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలుతోంది.
ఇప్పుడు మరణించిన వారే కాకుండా ఇంకా పలువురు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ గుర్తించే పనిలో వైద్యఆరోగ్య శాఖ తలమునకలుగా ఉంది.అంతే కాదు.. ఆ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారందరూ కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ సర్కారు చెబుతోంది. ఇతరులు కూడా అలాంటి వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులు చెబుతున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ మర్కజ్ లో జరిగిన ప్రార్థనలు దేశవ్యాప్తంగా కరోనా విస్తరించేందుకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఎందరు ఈ కరోనాకు బలవ్వాలో..?
No comments:
Post a Comment