దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. నిన్న ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 41కు చేరింది. పదుల సంఖ్యలో కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి చేరుకుంటున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వం నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలను మూసివేయాలని భావించింది. కానీ కేంద్రాలను మూసివేస్తే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు లాక్ డౌన్ ప్రభావం కొనసాగినన్ని రోజులు 5 రూపాయల భోజనాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పరిధిలోని 150 అన్నపూర్ణ కేంద్రాల నుంచి పేదలకు ఉచితంగా భోజనం అందనుంది. లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా హాస్టళ్లలోనే ఉండిపోయిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
కేటీఆర్ ఆదేశాల మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించనున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా కూరగాయల దుకాణాల దగ్గర జనం గుంపులు గుంపులుగా గుమికూడుతూ ఉండటంతో ప్రభుత్వం సంచార రైతు బజార్ల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని వాహనాలను ప్రవేశపెట్టిందని సమాచారం. మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై పేద ప్రజలు, హాస్టల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment